గుడిమెట్ట శిథిలాల్లో తెలుగు సంస్కృతి
(TELUGU CULTURE IN GUDIMETTA RUINS)
ముందుగా ----ఒక్క మాట
కృష్ణాజిల్లా నందిగామ కు 14 కి.మీ దూరం కృష్ణా
నది ఒడ్డున లో గుడిమెట్ట అనే ఒక చిన్నఊరు ఉంది. ఆ ఊరు కు ఒక కిలోమీటరు దూరం లో
మసీదు దిబ్బ అని పిలువబడే ప్రదేశం లో కొన్ని శిథిలాలు , దాని
పరిసరాల్లో కొన్ని పాడుపడిన ఆలయాలు ఉన్నాయని
కాలేజీ లోని నా విద్యార్థులు చెపుతుంటే చూద్దామని ఒక పర్యాయం అక్కడకు
వెళ్లడం జరిగింది. నేను చూసిన శిథిలాల్లో
హంపీ తర్వాత అంతగా బాథ పడిన ప్రదేశం ఇదే నేమో
ననిపించిది. అసలు ఆ రాజ్యం ఎవరిది. ఆ శిథిలాలు ఏంచెబుతాయి అనే ఉత్సుకత నాలో
కలిగింది. ఆ ఆవేశం లో కాండ్రపాడు పంచముఖేశ్వరుని
గూర్చిఒక వ్యాసం వ్రాసి ఆనాడు
సాహితీ పత్రిక గా బాగా ప్రసిద్థి
కెక్కిన భారతి సాహిత్య పత్రిక కు పంపించడం, అది మార్చి 1988 భారతి మాసపత్రిక లో ప్రచురించబడటం
జరిగిపోయింది. ఆ ఉత్సాహం తో “గుడిమెట్ట శిథిలాల్లో తెలుగు
సంస్కృతి (Telugu culture in Gudimetta ruins) ” అనే పేరు తో ఒక Minor Research Project ను ప్రారంభించి, U.G.C. ఆర్థిక సహాయం తో దాన్ని పూర్తి చేయడం
జరిగింది. ఇది ఆనాటి మాట .
ప్రస్తుతం నిర్మాణం లో ఉన్న ఆంధ్రరాష్ట్ర రాజధాని అమరావతి కి చేరువలో కృష్ణానది కి ఈవల వైపు ఈ గుడిమెట్ట ఉండటం వల్ల ఈ విశేషాలన్నీ మళ్లీ ఇప్పడు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది
నా ఈ పరిశోథనా గ్రంథాన్ని వందల కొద్ది
ఫోటోస్టాట్ కాపీలు తీసుకొని పంచుకుంటుంటే, మరి కొద్దిమంది మాటి మాటికి రావడం
ఒకటి రెండు కాపీల కోసం ఆ బైండు ని ఫోటోస్టాట్ కోసం వెనక్కి మడిచి
విరగ్గొట్టడం జరిగిపోతోంది. చివరికి ఆ
పుస్తకం మూలమే లేకుండా పోతుందేమో ననే భయం పట్టుకొని , దాని
లోని వ్యాసాలను ఈ బ్లాగు లో భద్రపరచాలని ఈ
ప్రయత్నం ప్రారంభించాను.
ఆ పుస్తకాన్ని అచ్చొత్తించవచ్చు కదా! అని కొంతమంది
అడుగుతున్నారు. కాని రామాయణం లఘుకావ్యాల మీద
పరిశోథన చేసి , డాక్టరేట్ పొందిన నా పరిశోథనా గ్రంథమే ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి 1996 లో
ప్రింటు చేస్తే అమ్ముకున్నవి , అంట కట్టినవి పోగా ఇంకా
కొన్ని కాపీలు ఇంట్లో బీరువాల్లో నల్లబడిపోతున్నాయి. ఈ రోజుల్లో పుస్తకాలు కొని
చదివే వాళ్లు తక్కువ. ఏ ఆథ్యాత్మిక ఉపన్యాసానికో వెళ్లినప్పుడు అక్కడున్న ‘
పెద్దలు’ అనుకున్నవాళ్లకి నా రామాయణ పుస్తకాన్ని బహుమతి గా ఇస్తే , కార్యక్రమం అయిపోయిన తర్వాత చివర్లో ఆ
కార్యక్రమ కార్యకర్త ఎవరో ఒకరు వచ్చి మీ పుస్తకాన్ని అక్కడ మర్చిపోయారండీ
అని నేను ఆ ‘ పెద్దమనిషి’
అనుకున్నాయనకు నేనిచ్చిన పుస్తకాన్ని తిరిగి నాకిచ్చిన ఘటనలు కూడ కొన్ని ఉన్నాయి.
అందుకని పుస్తకాన్ని ముద్రించి ఇబ్బంది పడటం నా కిష్టం లేదు.
అయితే ఈ మథ్య
వేరు వేరు ప్రదేశాలనుండి కొందరు చరిత్ర పరిశోధకులు , సాహిత్య అభిమానులు ఫోన్లు చేసి ఈ పుస్తకాన్ని గుఱించి అడుగు తూ
ఉండటం నేను ఏదో చెప్పి, తప్పుకోవడం
జరుగుతోంది. ఎందుకో ఒక శుభసమయం లో దీన్ని
ప్రత్యేకం గా బ్లాగు లో పెడితే
జిజ్ఞాసువులకు ఉపయోగపడుతుందని
పించింది. ఆలోచనే ఈ ప్రయత్నం. ఇక పుస్తకం లోకి వెడితే అసలు విషయం తెలుస్తుంది
కదా.
ఈ చారిత్రక
పరిశోధనా గ్రంథం అయిదు ప్రకరణాలు గా విభజించబడింది. అవసరాన్ని బట్టి ఛాయాచిత్రాలు , శాసనాలు , జిల్లాల చిత్రపటాలు
ఆయాప్రదేశాల్లో ఇవ్వబడ్డాయి. వాటిని కూడ ఈ ప్రయత్నం లో మీకు అందిస్తాను.
మొదటి ప్రకరణం
మాండలిక
రాజ్యాలు – గుడిమెట్ట
ఆంధ్రదేశం లో కృష్ణాతీరం లో
రాజ్యాన్ని స్థాపించి, చాళుక్య చోళయుగం నుండి కాకతీయ యుగాంతం వరకు గుడిమెట్ట రాజథాని గా రాజ్యపాలన సాగించిన రాజవంశం చాగి వారిది.
విజయవాటిక , గుడిమెట్ట , బృహత్కాంచీపురం (పెనుగంచిప్రోలు ) ప్రధాన కేంద్రాలుగా
వీరి రాజ్యపాలన కొనసాగింది.
చాళుక్య చోళ యుగం తెలుగు దేశ చరిత్ర లో అనేక విథాలుగా ప్రత్యేకతలను
సంతరించు కున్న కాలం. మధ్యాంధ్రదేశ చరిత్ర లో
ఒక విధం గా దీనిని మాండలికయుగ మని
పిలువవచ్చు. ఈ కాలం లో మాండలిక రాజులు వేరు వేరు ప్రాంతాల్లో చిన్న చిన్న
రాజ్యాలు నిర్మించుకొని, కులోత్తుంగ రాజేంద్ర చోడునకు విధేయులై, దైవభక్తి
,ధర్మానురక్తి కలిగి తెలుగు సంస్కృతిని
కాపాడుతూ రాజ్యపాలన చేసిన కాలమిది.
కులోత్తుంగ
రాజేంద్ర చోడుని పరిపాలనా కాలం లో సముద్ర తీరస్థ వేంగి లో చాళుక్య చోళుల పరిపాలన
నిర్నిరోధం గా కొనసాగింది. ఈతని శాసనాలు అనేకం వేంగీ దేశ లో కన్పిస్తున్నాయి.
అయితే వ్వన్నీ ఈతని సామంతులు వేయించినవే అవ్వడం గమనార్హం. వీరందరు తమ శాసనాల్లో తమ
ప్రభువును , తమ ప్రభువు విజయరాజ్య సంవత్సరాలను పేర్కొన్నారు. గోదావరీ సంగ్రామ విజయానంతరం ఆంధ్రరాష్ట్రం లో మాండలిక
రాజుల అధికారాలు పెరిగాయనే చెప్పాలి. దానికి కులోత్తుంగ చోళుని ఉదారతే ప్రధాన
కారణం గా చెప్పవచ్చు. మాండలిక రాజులు ఏటేటా తమకు చెల్లించవలసిన కప్పాన్ని , ఇతర
మర్యాదలను సరిగా పాటించు నంత కాలం మాండలికుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం
చాళుక్య చోడులు అనుసరించిన రాజనీతి. అందుకనే మాండలికులు పేరుకు మాత్రమే మాండలికులు
కాని అన్నివిదాల సర్వ తంత్ర స్వతంత్రులు గానే
వ్యవరించేవారు. ఇమ్మడి కులోత్తుంగ చోళుడు పశ్చిమ చాళుక్యాధికారం నుండి
వేంగిని విడిపించడం లో రెండవ కులోత్తుంగ చోళుడు ప్రదర్శించిన యుద్ధ నైపుణ్యానికి
మెచ్చి మేఘాడంబరయుగ్మ చామర
వియచ్చంద్రోదయా దులగు సామంత చిహ్నాలతో వెలనాటి వారికి ఆంధ్రదేశం లో అధికారాల్ని
పెంచాడు. వెలనాటి వారికి ఆంధ్రదేశం పై పూర్తి
ఆధిపత్యం లభించింది.
-2-
వేంగీదేశం లో
మాండలికరాజ్యాలు ఎన్ని ఉన్నప్పటికి అన్నింటిలోకి ప్రప్రధమంగా రాజ్యాధికారాన్ని పొంది రాజ్య విస్తృతిలో ప్రధమ గణ్యమైనది వెలనాటి దుర్జయ వంశము. అన్ని మాండలిక రాజ్యాల్లోకి తలమానికమైనది
వెలనాటి చోడవంశము. వీరు దుర్జయ వంశీయులయ్యు తమ ప్రభువులైన చోడ రాజన్యులపై నున్న
గౌరవాదరాలతో తమ సంతానానికి చోడ నామాన్ని గౌరవచిహ్నంగా ధరించి తమ బిడ్డలకు తమ
ప్రభువుల పేర్ల ను పెట్టుకొని గర్వం గా పిలుచుకొనే వారు. వెలనాటి కులోత్తుంగ
రాజేంద్ర చోడుడు వీరి వంశము లో ప్రసిద్దుడు.
కృష్ణానది కి దక్షిణం గా ఉన్న ప్రాంతానికి “ వెలనాడు ” అనిపేరు. ఇది ఈ నాటి గుంటూరుజిల్లా ప్రాంతం. ఈ వంశానికి మూలపురుషుడు
మల్లవర్మ..త్రిలోచన పల్లవ చక్రవర్తి ని సేవించి,
షట్సహస్రదేశాధిపత్యాన్ని,పొందిన వీరిని చరిత్రకారులు ఆరువేలనాడు ప్రాంతీయులు గా
పిలిచారు. ఆరువేలనియోగులు అనే ఒక శాఖ ఈ నాటికి బ్రాహ్మణుల్లో కన్పిస్తోంది. వారు ఈ
ప్రాంతము వారే. ఈ వెలనాటి చోడులలో ప్రసిద్ధుడు గొంకరాజు. ఈతని కాలం క్రీ.శ 1076-1108. ఇతడు ప్రధమ
కులోత్తుంగచోడ చక్రవర్తి వద్ద సేనాథిపతియై,
యాతని విశ్వాసమును చూరగొని, వెలనాటి పై అధికారాన్ని సంపాదించి , ఆనాటినుండి
ఆరువేలనాడు ను పాలించసాగెను. వెలనాటి వారికి ఇమేమడి కుళోత్తుంగ చోడుని ద్వారా
విశేషాధికారాలు సంక్రమించడం, మథ్యాంధ్ర దేశ మాండలికులకు ఆమోద యోగ్యం గా
లేకపోవడం వెలనాటి చోళులు యిరుగు పొరుగున
నున్న కోటవారి తోను ,పల్నాటి హైహయుల తోను ,కొండపడమటి వారి తోను సంబంధ బాంధవ్యాలను
చక్కజేసుకో సాగినారు.
వెలనాటి దుర్జయ
వంశీయులలో ప్రధమగణ్యుడు వెలనాటి గొంకరాజు. తడు పూర్వచాళుక్య రాజులను భక్తి విశ్వాసముల తో కొల్చిన వీరుడు. ఇమ్మడి
కులోత్తుంగ చోడుని పరిపాలనా కాలం లో కళింగ దేశము పై రెండు దండయాత్రలు చేశాడు.
మొదటి దండయాత్ర కులోత్తుంగుని 26 వ విజయ
రాజ్య వత్సరపు శాసనాల్లోను , రెండవది 40 వ
విజయరాజ్య సంవత్సరాల లోను తదనంతరకాలం లోను కన్పిస్తోంది. ఈతని 40 వ
విజయరాజ్య సంవత్సరం క్రీ.శ .1112 (శ.క
1032 ) . వేంగీ రాజకీయ కల్లోలాల కారణంగా కులోత్తుంగ చోళుడు తన 36 వ విజయ రాజ్యసంవత్సరానికి
పూర్వమే అనగా శ.క 1106 కు పూర్వమే,పూర్వకాలం నుండి
పూర్వచాళుక్యులను భక్తివిశ్వాసాలతో సేవించిన కులక్రమాగత సేవక కుటుంబం లోని
సమర్ధులగు సేనానులను కూడగట్టుకోవడానికి ,
వారు వేంగీ రాజప్రతినిధులకు బాసటగా
ఉండటానికి గాను దూరదృష్టి తో ఆలోచించి, వీరులైన సోనానులు కొందరికి. రాజలాంఛనాలను
ఇచ్చి,
-3-
మండలేశ్వరులు గా వారి హోదాను పెంచాడు. ఆ విధంగా వెలనాటి దుర్జయ వంశం లోని గొంకయ 1106
నాటికే సమధిగత పంచమహాశబ్ద మహా మండలేశ్వరుడై, చాళుక్య రాజ్య సామంతుడి గా కృష్ణ నది
దక్షిణప్రాంతాన్ని పాలించసాగాడు.
అయితే కళింగ
యుద్ధానంతరం కుళోత్తుంగచోళుడు ఆ విజయానికి కారణమైన అనేకమంది సైన్యాధికారులకు సామంత
చిహ్నాల నిచ్చి గౌరవించాడు. అనగా క్రీ.శ 1112 తర్వాత అనేక మాండలిక రాజ్యాలు
ఏర్పడ్డాయి. కళింగ యుద్ధ వృత్తాంతాన్ని
కులోత్తుంగ చోడుని ఆస్ధాన కవి యైన ‘జయగొండాక’ ‘కళింగత్తు
పరణి” అను పేర
గ్రంథంగా రచించాడు. ఈ
గ్రంధం ప్రకారం ఈ కళింగ యుద్ధాన్ని
అగ్రభాగాన నిలబడి నడిపించిన వాడు
కులోత్తుంగుని మంత్రి దండనాథుడైన కరుణాకర తొండమాను. ఈ తొండమాను కాంచీపురం
నుండి బయలుదేరి , దారిలో పాలేరు , పొన్ముఖరి ,(స్వర్ణముఖి ), పెన్న , మున్నేరు ,
కృష్ణ , గోదావరి , పంప , గౌతమీ నదులను దాటి కళింగము చేరినట్లు జయగొండాన్ వ్రాశాడు. ఈ విజయానంతరం కోన హైహయులు
, గుడిమెట్ట చాగివారు మరికొంతమంది కూడ సామంత చిహ్నాలను పొంది సామంతరాజ్యాలను
ఏర్పరచుకున్నారు. క్రీ.శ 1110- 1112
తర్వాత అనగా రెండవ కళింగయుద్ధానంతరం కుళోత్తుంగ రాజేంద్రుని ద్వారా
పంచమహాశబ్దాలను పొంది, మండలేశ్వరుడై , ‘చాగి’ రాజ్యాన్ని గుడిమెట్ట లో
స్ధాపించాడు ముప్పభూపాలుడు.
పశ్చిమ చాళుక్యుల తోటే ఈ చాగి వారు కూడ ఆంధ్రదేశం లో ప్రవేశించారనడానికి
ఆధారాలున్నాయి. మహామండలేశ్వర చాగి బేతరాజు మాధవీ పట్టణం లోని (గురజాల )
త్రిమూర్త్యాలయానికి భూదానం చేసినట్లు
సౌమ్య వత్సరానికి సరియైన శకవర్షము
1051 ( క్రీ.శ.1129 ) వ్రాయించిన
శాసనమొకటి కన్పిస్తోంది. ఇందులోనే చాగి
వంశీయులు పలనాటి హైహయులకు సామంతులైనట్లు చెప్పబడింది. వీరు భూలోకమల్ల సోమేశ్వర
చక్రవర్తి తమ ప్రభువైనట్లు
ప్రకటించు కున్నారు. గుడిమెట్ట
శిథిలాలలో పూర్తి గా అగ్రాహ్యం గా ఉన్న ఒక
శాసన స్థంభం పై మల్లవర్మ , త్రిలోచనపల్లవుని పేర్లు కన్పిస్తుండటం తో వీరు పశ్చిమ
చాళుక్యులతో సంబంధాలను కల్గి ఉన్నట్లు సందేహించవలసి వస్తోంది. పూర్వచాళుక్య
రాజన్యుల సేవించి ,రెండవ కులోత్తుంగ చోడుని కాలం లో రాజ్యార్హత పొందారు చాగివారు.
కులోత్తుంగ రాజేంద్రుని ద్వారా ఆంధ్రదేశానికి అధికారులుగా ప్రకటించబడ్డ వెలనాటి వారికి సామంతులు గా వీరు రాజేంద్రచోడుని గౌరవించారు.
వారి పాలనను అంగీకరించి వారి సామంతుడు గా మొదటి దోరభూపతి చాగి వంశం లో రాజ్యపాలన
చేశాడు. ఇందుకు
-4-
ఉదాహరణ గా
కృష్ణాజిల్లా కొనకంచి లోని హనుదాలయం లో వెలనాటి రాజేంద్రచోడుని శాసనం
ఒకవైపు ఉండగా – రెండవ వైపు త్యాగిపోతరాజు
శాసనం కన్పిస్తోంది.
రెండవ
కులోత్తుంగచోడుడు రాజ్యానికి రాగానే
అనేకమైన యుద్దాల్లో పాల్గొన వలసి వచ్చింది. వెలనాటి గొంకరాజు మరణించడం
తో పూర్వచాళుక్యులు పిఠాపురం కేంద్రం గా
స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోవడం చూసిన కోనహైహయులు కూడ స్వాతంత్య్రం
ప్రకటించుకున్నారు. వారి ననుసరించి ఉండి పురం రాజదాని గా పరిపాలన సాగిస్తున్న
క్షత్రియులు వెలనాటి చోడులపై తిరుగుబాటు ప్రక టించారు. ఈ సమయం లో రెండవ కులోత్తుంగ
రాజేంద్రచోడుడు కొలనిపురం పై దాడి చేసి కోన హైహయ రాక్షసభీముని, అతని కుమారులను
సంహరించి , తన ఆథిపత్యం లోకి తెచ్చుకున్నాడు.ఈ యుద్ధం శకవర్షం 1168 లో జరిగింది.
త్రిపురాంతకం వద్ద కోనరాజులతో జరిగిన యుద్దం లో వెలనాటి సైన్యానికి నాయకత్వం వహించింది కులోత్తుంగ రాజేంద్రచోడుని
ప్రధాని అమృతలూరి మంచెన ప్రగ్గడ కుమారుడు
దేవన ప్రగ్గడ. ఇతడు హైహయులను పూర్తిగా ఓడించి, తరిమికొట్టి ,కృష్ణ
గోదావరులను దాటి కోనమండలం లో ప్రవేశించి, శతృదేశాన్ని తగులబెట్టి , ఆక్రమించుకున్నాడు.
ఇతని సాసనాలు శ.క 1085, శ.క. 1087 ల్లో ద్రాక్షారామం లో కన్పిస్తున్నాయి. ఇదే సమయం
లో కాకతి రుద్రదేవుని శాసనం ఒకటి ద్రాక్షారామం లో కన్పిస్తోంది. దీని కాలం క్రీ.శ .1168 . కాకతి
రుద్రదేవుడు కృష్ణ ను దాటి , ఉత్తరాన
వున్న నతనాటి సీమ నేలుచున్న రాజులతో సంబంధబాంధవ్యాలను ఏర్పరచుకొన్న
కాలమిది.
వెలనాటి
కులోత్తుంగ చోడుడు కృష్ణనదికి ఉత్తరాన జరిగిన తిరుగుబాటు ను అణచి వేసి , స్వతంత్ర
రాజ్యాన్ని ఏలుతున్న రోజుల్లో కర్నాటక లో సంభవించిన గొప్ప రాజకీయ విప్లవం వలన కొచ్చెర్వుల పుర
యుద్ధం సంభవించింది. ఈ యుద్ధాన్ని గురించి మంచెన కవి తన కేయూరబాహుచరిత్ర లో చక్కగా
వర్ణించాడు. ఈ యుద్ధం లో కర్ణాటక సైన్నాన్ని ఎదుర్కోవడానికి కులోత్తుంగ చోడుడు తన
ప్రధాని యైన కొమ్మనామాత్యుని
యుద్ధరంగానికి పంపాడు. కోటనాయకులు సహాయం చేశారు. వెలనాటి సైన్యానికి విజయం
ప్రాప్తించింది. కులోత్తుంగచోడుడు కొండపడమటి బుద్ధరాజు సోదరి యైన అక్కమహాదేవిని
పరిణయమాడాడు. వీరి మనుమడే పృధ్వీశ్వరుడు. వెలనాటి కులోత్తుంగ చోళుని చివరి
రోజుల్లో కృష్ణ దక్షిణ తీరాన్ని
పాలిస్తున్న రాజ్యాలకు ముసలం వలే పల్నాటి యుద్ధం దాపురించింది.
పల్నాటియుద్ధం.:--
ఈ పల్నాటి యుద్ధం లో కోట వారు , వెలనాటి వారు , పల్లవులు , భళ్ళా లులు, గుడిమెట్ట
చాగివారు , కాకతీయులు పాల్గొన్నారు. కోటవారి లో కోట రెండవ భీమరాజు ,
- 5-
కాకతీయులలో మొదటి రుద్రదేవుడు ( 1158- 1195 )
, వెలనాటి వారి లో మూడవ గొంకరాజు (1181-86), చాగివారి లో త్యాగి పోతరాజు (1161- ) , నలగామరాజు పక్షం వహించారు.
పల్నాటియుద్ధం శా.శ (1098-1104 మథ్య జరిగినట్లు గా శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ
భావించారు. పింగళి లక్ష్మీకాన్తం గారు
శా.శ 1095- 1104 మథ్య జరిగి ననట్లు గా
పల్నాటి వీరచరిత్ర పీఠిక లో సోపపత్తికం గా నిరూపించి
యున్నారు.(భారతి-774.పే.అంగీరస.కార్తీక.) . భవరాజు కృష్ణరావు పంతులు గారు ,
చిలుకూరు వీరభద్ర రావు గారు శా.శ 1098—1104 నడుమ పల్నాటి యుద్ధం జరిగి ఉండవచ్చని
భావించారు. అనగా క్రీ.శ 1176- 1182 మథ్య పల్నాటి యుద్దం జరిగిందని భావించవచ్చు.
శ్రీనాథుని పల్నాటి
వీరచరిత్రము చారిత్రక కావ్యము. ఈ కావ్యం లో చరిత్ర ,కల్పన పెనవేసుకున్నాయని
విమర్శకులు భావిస్తున్నారు.(విజ్ఞాన సర్వస్వము-3219 పే.,తెలుగుసంస్కృతి-2) ఈ
గ్రంధము నందు ప్రస్తావించిన వారందరూ కాకపోయినా ప్రధానవ్యక్తులు కొందరు చారిత్రక
పురుషులు గా ప్రసిద్ధులు. వీరి జీవితకాలాన్ని
- పల్నాటి యుద్ధం తో బేరాజు వేసి
ఖ్రీ.శ 1176 – 82 మథ్య ఈ యుద్ధం
జరిగినట్లు అంగీకరించవలసి ఉంది. ఈ పల్నాటి యుద్దం చాగివారి పరిపాలనాకాలాన్ని
నిర్ణయించడం లో ఆధారమైంది. కాబట్టి దీన్ని గురించి ఇంతగా చర్చించవలసి వస్తోంది.
ఈ పల్నాటియుద్ధం వలన పల్నాటి హైహయ రాజ్యం పూర్తిగా చితికి పోగా, రుగుపొరుగు
మాండలిక రాజ్యాలు ధన, ప్రాణ నష్టాలు కలిగి
బలహీనమై పోయాయి. ఇదే అదనుగా కళ్యాణం
రాజధాని గా పరిపాలన సాగిస్తున్న కాళచురి సైన్యం కావణయ్య దండనాయకుని ఆథిపత్యం
లో వెలనాటి కులోత్తుంగచోడుని పై దండయాత్ర
చేసింది. ఈ దండయాత్ర వలన వెలనాటి రెండవ కులోత్తుంగ చోడుని ప్రాభవం చాలవరకు
అంతరించింది. ఈ కాలచుర్య నిశ్శంకమల్ల సంకమదేవుని ప్రధాన దండ నాయకుడైన కావణయ్య
కు “ వెలనాడు చోడయరాజ్య
నిర్మూలన “అనే బిరుదు కూడ ఉంది. కాకతి రుద్రదేవుడు కూడ ఈ
సమయం లో పల్నాటియుద్దం లో నలగామునకు సహాయం
వెళ్లినట్లు గా నటించి, వెనువెంటనే కృష్ణా దక్షిణ ప్రాంతంపైనే తన దండు నడిపాడు.
కోటరాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. కోట రాజ్యపతనం
కొండపడమటి రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి అవకాశం కల్పించింది. విప్పర్ల
వారు కూడ రుద్రదేవునికే సహాయం చేశారు. “బుద్దవర్మ వంశ విస్తారక
“ అనే బిరుదును పొందారు. అతికొద్దికాలం లోనే అనగా క్రీ.శ .1185 నాటికే వెలనాటి లో చాలభాగం
కాకతీయుల వశమైంది. ఇదే సమయం లో గుడిమెట్ట లో కాకతీయుల శాసనాలు కన్పిస్తున్నాయి.(
Arc.314 )
-
6 –
పల్నాటియుద్ధం లో గుడిమెట్ట సామంతరాజ్యపు చారిత్రక వ్యక్తి చాగి పోతరాజు పాల్గొన్నట్టు ఇంతకు ముందే
చెప్పుకున్నాము.
“సాగి పోతమరాజు సత్యాఖ్యప్రెగ్గడ
గుండమదేవుడు గొబ్బూరి రాజు
మొదలయిన వారల ముఖ్యులౌ బంట్లు
-------------- నెనుబది మీద
నెనిమిది వేలతో నే తెంచి రపుడు “
--- అని శ్రీనాథుని పల్నాటి వీరచరిత్ర. ఈ యుద్ధం క్రీ.శ.
1176-82 నడుమ జరిగి ఉంటుందని ఇంతకు ముందే
చెప్పుకున్నాం. క్రీ.శ 1120 ప్రాంతంలో
పురుడు పోసుకున్న చాగి మాండలిక రాజ్యం లో
ముప్ప భూపాలుడు, అనంతరం దోరభూపతి , వారి యనంతరం
మొదటి పోతరాజు. ఇతనినే త్యాగి పోతరాజు అని కూడ పిలుస్తారు.క్రీ.శ.
1140 ప్రాంతం లో రాజ్యానికి వచ్చిన పోతరాజు పల్నాటియుద్ధ కాలం నాటికి మథ్య వయస్కుడై
ఉండవచ్చు. అంతేకాదు .పల్నాటి యుద్ధానంతరం ఇతని శాసనాలేవీ కన్పించడం లేదు. అందువలన మొదటి పోతరాజు పల్నాటి
యుద్ధం లో మరణించి ఉండవచ్చని విమర్శకులు భావిస్తున్నారు. ఈతని యనంతరం ఈతని
కుమారుడు రెండవ దోరభూపతి రాజధానిని
గుడిమెట్ట నుండి విజయవాటిక కు మార్చి క్రీ.శ .1197 వరకు రాజ్యపాలన చేసినట్లు
శాసనాద్యాధారాలు లభిస్తున్నాయి. “ చాగిరాజ పంచదశ వర్షాణి
విజయవాటికాం ధర్మమార్గేణ శశాస. “ అనగా పోతరాజు మరణానంతరమే
దోరభూపతి తన రాజధానిని విజయవాటికకు మార్చినట్లు గా భావించవచ్చు.
అయితే
పోతరాజు మరణానికి పల్నాటి యుద్ధం కాక వేరేకారణం ఒకటి గ్రంథాల్లో కన్పిస్తోంది. అదే
వేములవాడ భీమకవి శాపవృత్తాంతం. వేటూరి వారి చాటుపద్యమణిమంజరి లో కన్పించే “ హయ మది సీత పోతవసుదాధిపు డారయ
రావణుండు ---------------- “ ఇనే పద్యం వేములవాడ భీమకవి ది గా
చాలామంది వ్రాశారు. ఈ పద్యం రెండవ తిరుమలయ్య దని అప్పకవి చెపుతున్నాడు. ఈ పద్యం
లోని పోతరాజు సాగిపోతరాజు కాదని, వేటవరపు పోతరాజ ని, ఈ పద్యం తురగా రామకవి వేటవరపు
రామకవి ని గూరిచు చెప్పిన పద్యమని శ్రీ కందుకూరి వీరేశలింగం , శ్రీ గుఱజాడ శ్రీరామమూర్వ్రాసియున్నారు. ఆంధ్రకవితరంగిణి కర్త శ్రీ చాగంటి శేషయ్య
వేములవాడ భీమకవి కాలాన్ని , పోతరాజు కాలాన్ని సరి జూసి, భీమకవి తిట్టినదీ
పోతరాజునే యని భావించితి మేని భీమకవి కాలము క్రీ.శ 1140-50 మథ్య కాలమని చెప్పి,
మొదటి పోతరాజు ,రెండవపోతరాజు లలో
తికమకపడి, మనల్ని తికమకపెట్టి, మొదటిపోతరాజు కాలానికి భీమకవి కాలాన్ని
సరిచేశారు. అయితే పల్నాటి యుద్ధానికి
,దీనికి సరిపోవడం లేదు.
-7-
భీమకవి
తిట్టింది రెండవ పోతరాజు నేమో అనుకోవడానికి ,రెండవ పోతరాజు కాలం లో రాజథాని విజయవాటిక .కాబట్టి అక్కడ గుడిమెట్ట ప్రసక్తి రాదు. మొదటిపోతరాజు – రుద్రమహారాజు, కోట భీమరాజులతో
నలగామరాజు కు సహాయం గా వెళ్లినవాడు.
కాబట్టి భీమకవి కాలానికి ముందు వాడు. క్రీ.శ.1080 -1140 మథ్య కాలం లో జీవించిన
వేములవాడ భీమకవి క్రీ.శ 1146 -79 మథ్య జీవిచిన పోతరాజుకు శాపం పెట్టడం సాథ్యం
కాదు. పోనీ. రెండవ పోతరాజేమో అనుకుందామా అంటే ఇతను క్రీ.శ.1190 -1230 వరకు
రాజ్యపాలన చేసినట్లు , సింహాచలం ,వేదాద్రి,
ముక్త్యాల వంటి పుణ్యక్షేత్రాల్లో అనేక దానధర్మాలు చేసినట్లు, నరసింహవర్ధనపోతరాజు
గా కీర్తించబడినట్లు అయా శాసనాలు
సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇక్కడకు భీమకవి కాలం కలవదు. భీమకవి చెప్పిన పద్యం
ఇది.
“హయమది
సీత పోతవసుదాథిపుడారయ రావణుండు ని
శ్చయముగ నేను రాఘవుడ ; సహ్యజ వారధి ; మారుడంజనా
ప్రియ
తనయుండు
; లచ్చన విభీషణు డా గుడిమెట్ట లంక ; నా
జయమును
పోత రక్కసుని చావును నేడవనాడు చూడుడీ !.”
-ఈ పద్యం యొక్క
పూర్వాపరాలు ఇలా చెప్పుకుంటున్నారు. భీమకవి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరానికి వచ్చి ఒక చల్లని ప్రదేశం లో తన గుఱ్ఱాన్ని మేతకు విడిచి, తాను విశ్రాంతి తీసుకుంటున్నాడు.ఇంతలో ఆ గుఱ్ఱాన్ని చూచి మోజు
పడిన పోతరాజు కుమారుడు, తన సైన్యం చేత దానిని బంధించి తీసుకుపోయాడని, కోపించిన
భీమకవి ఈ శాపాన్ని ప్రయోగించాడని ఈ
ప్రాంతం లోని వృద్దులుచెప్పుకుంటుంటారు.
కాని పరిశోధనలో వీరి కాలాలు కలవడం లేదు.
- 8 –
మొదటి
పోతరాజు కాలం – క్రీ.శ .1140 – 82
రెండవ
దోర భూపతి --- క్రీ.శ --
- 1197
రెండవ
పోతరాజు -- క్రీ.శ. 1197 –1230
గణపయరాజు --- ---------- -
1250
మనుమ
చాగి గణపయ -------- -- 1270
మూడవ పోతరాజు
------------- 1282
ఈతని యనంతరం
భీమరాజు కుమారులు కొంతకాలం రాజ్యపరిపాలన చేసినట్లు శాసనాలు కన్పిస్తున్నాయి. ఇవి
చాగి వారి పరిపాలనా కాలాలు. కొద్దిగా తేడాలు ఉండవచ్చు. కాబట్టి ముగ్గురు
పోతరాజుల కాలం లో ఏ కాలమూ భీమకవి కాలానికి (1080 -1140) సరిపోవడం లేదు. కాబట్టి ప్రముఖ
విమర్శకులు అక్కిరాజు ఉమాకాన్త గారు కూడ పై పద్యం
వేటవరపు పోతరాజుని గూర్చి చెప్పిందే నని
స్పష్టం చేశారు.
సమగ్రాంథ్ర సాహిత్య రచయిత శ్రీ ఆరుద్ర వీనినన్నింటినీ కూలంకషంగా
పరిశీలించి,వేములవాడ భీమకవి కాలాన్ని నిర్ణయించడానికి ప్రయత్నించారు. భీమకవి
ఇతరులను గూర్చి చెప్పిన చాటువులు ,భీమనను గూర్చి అనంతర కవుల ప్రస్తావనలు ,ఆ యా
రాజుల కాలాల్లోని శాసనాద్యాధారాలను సమన్వయం చేయడం తో పాటు శ్రీ ఆరుద్ర శ్రీ
పూసపాటి రాచిరాజు రచించిన సీసమాలిక ను బట్టి నిడదవోలు వెంకటరావు గారి పరిశోధనలను
ఉటంకించారు. ఈ సీసమాలిక లో వత్సవాయి వారి మూలపురుషుని గా దానరాజు ని పేర్కొని అతడు
చంద్రవర్మ చే వత్సవాయి ని కానుక గా పొందాడని , ఈ బహుమానపు తారీఖు క్రీ.శ 1175 అని
చెప్పబడిన దానిని ఆరుద్ర త్రోసిపుచ్చారు. వత్సవాయి వారి మూలపురుషుడు సాగి పోతరాజు
అని, వత్సవాయి గోపరాజు కు అంకితంగా ఏనుగు
లక్ష్మణ కవి రచించిన రామవిలాస కావ్యాన్ని
గుర్తు చేశారు ఆరుద్ర . సలు గణపతి దేవునకు పూర్వం ( క్రీ.శ 1320 ) వత్సవాయి అను పేరుగల రాజవంశమే
లేదన్నశ్రీ చిలుకూరు వీరభద్రరావు గారి వాదనతో ఏకీభవించారు ఆరుద్ర. ( సమగ్ర ఆంథ్ర సాహిత్యం- చాళుక్యయుగం -ఆరుద్ర). తుదకు
మైలమ భీముని కాలాన్ని, వేములవాడ భీమకవి కాలాన్ని
సరిచేసి నిరూపించారు. అది క్రీ.శ. 1121 . వేములవాడ భీమకవి కూడ ఆ
- 9 -
కాలం వాడని సక్రమంగా నిరూపించవచ్చు. పరిశోధకుల దృష్టి లో వేములవాడ భీమకవి కాలం
క్రీ.శ .1121. ఆనాటికి చాగి పోతరాజు లేడు.
గుడిమెట్ట రూపుదిద్దుకుంటున్న తొలిరోజులవి.అందువలన
“హయము” భీమకవి దే కాని పోతవసుధాధపుడు
మాత్రం వేటవరపు పోతరాజేనని అంగీకరిస్తే ఈ
చర్చ ముగుస్తుంది.
ముప్పభూపాలుడు రాజేంద్రచోడుని నుండి పంచమహా
శబ్దాలను పొంది , మహా మండలేశ్వరుడై, చాగి వంశానికి చారిత్రక పురుషుడైనాడు.
రాజరాజనరేంద్రుని కుమారుడైనరాజేద్ర చోడుని కాలం నుండియే సామంతరాజ్యాలు , సామంత
పదవులు ఆంధ్రదేశం లో విలసిల్లినట్లు గా చరిత్ర చెపుతోంది. గుడిమెట్ట శిథిలాల్లో
కన్పించే ఒక శాసనం లో (
తేదీ లేదు ) రాజేంద్ర చోడుని నుండి ముప్పభూపాలుడు పొందిన గౌరవాలు ప్రస్తావించబడ్డాయి.
“
శ్రమ ------------- ప ఇతి విశ్రుత నామధేయో
రాజేంద్ర చోడనృప -------- శుభ్రకత్తిక :
సోస్మాద్రాజేంద్ర చోడాదతులమర ---------
ట్టకం ప్రాప్య చాలో
------------ ( ARC-313/1924
)
--- ఇత్యాదిగా రాజేంద్ర చోడ నృపుని ప్రస్తావన
ఉంది. ఇచ్చట బిరుదులు శిథిలమైనాయి. ఇతను వెలనాటి చోడుడని ఒక వాదన ఉంది. కాని
వెలనాటి చోడుని నాటికి మొదటి పోతరాజు పరిపాలన సాగుతోంది. అంతేకాదు. కొనకంచి లోని
హనుమదాలయం లో వెలనాటి చోడుని , మొదటి పోతరాజు శాసనాలు ఒకే బండకు రెండు వైపులా
కన్పిస్తున్నాయి .(ARC- 269/24) రాజేంద్రచోడుని కాలం
క్రీ.శ.1146 గా వ్రాయబడింది. అనగా శా.శ. 1068. అందువలన “ముప్పభూపాలుని
“ నుండే చాగి వారి పాలన ను గణించడం జరిగింది. చాగివారి శాసనాల్లో
ఎక్కడా వారి ప్రభువుల సేవలో వారి మేలు
కోసం శాసనాలు వేయబడినట్లు కన్పడ్డం లేదు.
వీరి పాలనంతా “మహామండలేశ్వరులు “ గా సర్వతంత్ర స్వతంత్రులు గానే సాగినట్లు
కన్పిస్తోంది. ఈ కాలం లోని కొందరు సామంతులు “ చాళుక్య రాజ్య సముద్ధరణ “ “ చాళుక్య రాజ్య మూలస్థంభ “ వంటి బిరుదు గద్యలతో శాసనాలు వ్రాయించారు. కాని చాగి వారి శాసనాల్లో
మాత్రం అటువంటి బిరుదు గద్యలు కన్పించవు. చాగి వారి ఇలవేల్పు నరసింహస్వామి. వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి
పాదపద్మారాధకులు వీరు. వీరి శిథిల దుర్గానికి దగ్గర్లోనే వేదాద్రి పంచనారసింహక్షేత్రం ఈనాటికీ వెలుగొందుతూ భక్తులను కాపాడుతూనే ఉంది. రెండవపోతరాజు నుండి మన్మగణపతిదేవరాజు వరకు
లభించిన శాసనాల్లో “నరసింహవర్ధన” బిరుదనామం సమానంగా కన్పిస్తోంది. రెండవపోతరాజు
జుజ్జూరు శాసనం – పోతరాజు అల్లుళ్ళు వేయించింది. దీనిలో పోతరాజు ని ఇలా
వర్ణించారు.
“ శ్రీ యోగానంద నరసింహ
దేవర దివ్యశ్రీ పాద పద్మారాధక”
“సమస్త సేనాగణనాలంకృత”
“చతుర్విధ పురుషార్ధ సాధక”
“దుష్టరిపు మర్ధన “
“నరసింహవర్ధన “
“మహామండలేశ్వర “ (ARC -326/24)
దీన్ని బట్టి ఆనాటి ప్రభువుల
ఔదార్యం , మాండలికుల సర్వతంత్ర స్వతంత్రత్వం మనం ఊహించుకోవచ్చు. ఆనాటి ఈ
మాడలికరాజ్యం గుడిమెట్ట,రంగరాజు కొండ శిథిలాల్లో మిగిలిపోయినా, వత్సవాయి
,పెద్దాపురం సంస్దానాల్లో మరి కొంతకాలం కొనసాగింది.
చాళుక్యచోళయుగం లో
అంకరించిన ఈ గుడిమెట్ట రాజ్యం కాకతీయుల , రెడ్డిరాజుల పాలన లో పలు రీతుల పల్లవించి
,బహమనీ కాలం లో మట్టి లో కలిసిపోయింది. కుతుబ్షాహీ నవాబు బృహత్కాంచీపురం లో పెనుగంచిప్రోలు తన మూడవ యుద్ధాన్ని ముగించాడు. సుమారు రెండు శతాబ్దాల
కాలం కొనసాగిన చాగి వారి పాలన లో ఏ ఒక్క కవీశ్వరుని కావ్యం ఆధారం గా లభించలేదు.
అంటే ఆనాటి ఆంథ్రజాతి కాపాడుకోలేకపోయింది. లభించిన శాసనాలు సగానికి సగం శిథిలమై పూర్తి సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నాయి. అందుకే ఒక్కటొక్కటి గా
జారుతున్న నీటిబిందువులను దొన్నెలోకి
పట్టడానికి చేస్తున్న తొలి ప్రయత్న మిది. లభించిన ఆధారాలు కొద్ది. అల్లుకోవలసిన
ఆకరాలు అతిమాత్రంగా అయినాయి. శ్రీ యోగానంద
నారసింహుని ఆశీస్సుల పరిఢవిల్లి ,రాణి రుద్రమదేవి పాదస్పర్శ తో పులకించి, పోతరాజు
పరాక్రమాలతో విలసిల్లిన మాండలిక రాజ్యం ఈ గుడిమెట్ట.
మొదటి ప్రకరణం సంపూర్ణం
****************************************************
No comments:
Post a Comment